సింగపూర్‌లో నారా లోకేష్ నయా అవతార్... ఫొటోలు ఇవిగో!

  • సింగపూర్ పర్యటనలో సూటు బూటుతో కొత్త లుక్‌లో కనిపించిన మంత్రి నారా లోకేష్
  • ఓ చోట టక్ చేసుకుని దర్శనమిచ్చిన వైనం
  • ఏపీలో ప్రపంచ స్థాయి మైస్ ఎకోసిస్టమ్ ఏర్పాటుపై కీలక చర్చలు
  • విశాఖ, అమరావతి, తిరుపతిలలో ప్రత్యేక బ్యూరోల ఏర్పాటుకు ప్రణాళిక
  • రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో 20,000 హోటల్ గదుల సామర్థ్యం పెంపు లక్ష్యం
  • ఏపీని గ్లోబల్ బిజినెస్ హబ్‌గా మార్చడమే ధ్యేయమన్న లోకేష్
ఎప్పుడూ సింపుల్ డ్రెస్సింగ్ తో కనిపించే ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, తన సింగపూర్ పర్యటనలో సరికొత్తగా, ప్రొఫెషనల్ లుక్‌లో దర్శనమిచ్చారు. ఎప్పుడూ సాధారణ డ్రెస్సింగ్‌లో ఉండే ఆయన, అందుకు భిన్నంగా సూటు బూటులో దర్పంగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఓ కార్యక్రమంలో టక్ చేసుకుని కనిపించారు. కేవలం డ్రెస్సింగ్ లోనే కాదు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలోనూ తన మార్క్ చూపేందుకు ఆయన సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం సింగపూర్‌లో పర్యటిస్తున్న లోకేష్, ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ బిజినెస్, ఈవెంట్లకు కీలక గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో కీలక చర్చలు జరుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా, సింగపూర్‌లోని ప్రఖ్యాత సన్‌టెక్ సిటీని సందర్శించినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి మైస్ (ఎంఐసీఈ - మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్) ఎకోసిస్టమ్‌ను ఎలా నిర్మించాలనే దానిపై చర్చించినట్లు వివరించారు.

ఈ ప్రణాళికలో భాగంగా విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో ప్రత్యేక ఫెసిలిటేషన్ బ్యూరోలు ఏర్పాటు చేయనున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో హోటల్ గదుల సామర్థ్యం నాలుగు రెట్లు పెరిగి 20,000కు చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో ఇప్పటికే 4 కన్వెన్షన్ సెంటర్లకు ఆమోదం లభించిందని, భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో విశాఖలో ప్రపంచ స్థాయి మైస్ డెస్టినేషన్ రానుందని తెలిపారు.

గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి గ్లోబల్ టెక్ కంపెనీలు విశాఖలో విస్తరిస్తున్నాయని గుర్తు చేస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ బిజినెస్, ఎగ్జిబిషన్లు, ఈవెంట్లకు తదుపరి ప్రధాన గమ్యస్థానంగా నిలబెట్టడమే తమ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు.

Nara Lokesh
Singapore
Andhra Pradesh
Global Business
MICE
Visakhapatnam
Amaravati
Investments
SunTec City
IT Minister

More Telugu News